సమస్య మూలాలు తెలిస్తేనే.. సమస్యకు పరిశ్కారం లభిస్తుంది. సమస్యను మూలాలనుంచి తొలగించుకుంటూ వస్తేనే ఆ సమస్యకు శాశ్వత పరిశ్కారం దొరుకుతుంది. సమస్య మూలాలజోలికి వెళ్ళకుండా.. ఒకరు చేసిన తప్పును మరొకరు, ఇంకొకరు.. ఇలా చేసిన తప్పే మళ్ళీ..మళ్ళీ చేస్తూ... మేము సినిమా చేశాం నష్టపోయామని చెప్పడం సరికాదు. నష్టపోయేలా సినిమా నిర్మించడం కాదు, నష్టమే రాకుండా సినిమా నిర్మించడం తెలుసుకున్నప్పుడే.. విజయవంతమైన సినిమా నిర్మించడం సాధ్యం అవుతుంది.
నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, విజయవంతమయ్యే సినిమా నిర్మించడం కోసం పరిశోధనాత్మక వ్యాసం.ప్రతి సినిమా ఆయా దర్శక, నిర్మాతలకు ఓ మధురమైన స్వప్నం.. అదో తపస్సు...!:
విజయం మాత్రమే ప్రతిభకు నిదర్శనం గా భావించే సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ, తమ చిత్ర ఘన విజయం కోసం నిద్రాహారాలు మాని తమ చిత్రాన్ని నిర్మిస్తారు. వారి చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని, తెలుగు సినీ పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతారు. తమ చిత్ర నిర్మాణం తర్వాత విడుదల కోసం ఎన్నెన్నో ప్రణాళికలు రూపొందిస్తారు.
ఇల్లు కట్టి చూడు.. పెళ్ళి చేసి చూడు... కాదు.. "సినిమా విడుదల చేసి చూడు..?":
ఒక మోస్తరు నుంచి పెద్ద నటులు, టెక్నీషియన్లు పనిచేసిన సినిమా విడుదల మినిమం గ్యారంటీగా కనిపించినా.. అనేక అడ్డంకులను అధిగమించి తమ సినిమాను విడుదల చేస్తారు. సదరు సినిమా హిట్ అయితే సంబరాలే.. సంబరాలు!. ఆ విజయం మాటున ఎవరేం చెప్పినా నడుస్తుంది. అమాంతంగా ఆ దర్శక నిర్మాతలకు, నటీనటులు.. టెక్నీషియన్లకు మంచి పేరు.. మరిన్ని అవకాశాలు..
అలా కాకుండా బాక్స్ ఆఫీస్ లో నిలబడక పోతే? దర్శకత్వం బాగాలేదని, నిర్మాత సహకరించలేదని, ఆర్టిస్టుల గొంతెమ్మ కోర్కెలతో నష్టపోయామని, ఎవరూ సరిగా రాణించలేదనీ.. ఎన్నెన్నో అభాండాలు.. నచ్చని వారిపై గుప్పుమని చల్లుతూనే ఉంటారు.
ఇక మొత్తం కొత్తవారితో చిత్రాలను నిర్మించిన వారయితే.. తమ చిత్రాన్ని విడుదల చేయలేక రెండు చేతులూ ఎత్తేస్తారు. కొందరు నిర్మాతలు మాత్రం ఆ సినిమా దర్శకుడు, నటీనటులు.. టెక్నీషియన్ల ప్రోద్బలంతో.. లేదా తమ చిత్రం పై ఉన్న నమ్మకంతో.. లేదా ఎవరేమనుకుంటారో ననే ప్రెస్టేజ్ కోసమో.. సినిమా రిలీజ్ ఖర్చులన్నీ తానే భరించి తమ చిత్రాన్ని విడుదల చేసి.. రిజల్ట్ కోసం ఎదురు చూస్తారు. ఆ తర్వాత ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్, ఓవర్సీస్ ఇలా అన్ని చోట్లా ఎదురయ్యే ప్రతిబంధకాలను అధిగమించడం కోసం అందరి చుట్టూ తిరుగుతూ ఎలాగోలా పెట్టిన డబ్బులు వెనక్కి వస్తే చాలునని ప్రయత్నిస్తాడు. చివరికి పెట్టిన పెట్టుబడులు రాక, తెచ్చిన డబ్బులకు ఇంట్రెస్ట్ కట్టలేక మానసికంగా చిత్రవధ అనుభవిస్తూ ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తాడు. సదరు దర్శకుడు, నటీనటులు.. టెక్నీషియన్లకు ఆ సినిమా ఓ ఫెయిల్యూర్ మాత్రమే అవుతుంది.. కాని, చివరికి నష్టపోయేది మాత్రం.. అక్షరాల ఆ చిత్ర నిర్మాతే..!? రోడ్డున పడి ముఖం చాటేసి.. ఓడిపోయిన వ్యక్తిగా.. కొన్ని సందర్భాల్లో మోసం చేసిన వ్యక్తిగా మిగిలిపోయేది నిర్మాత మాత్రమే.
నిర్మాత నష్టపోవడానికి అసలైన భాధ్యుడు... ఆ నిర్మాత మాత్రమే..!?
కాని ఒక విషయం మాత్రం స్పష్టం. అత్యధిక సందర్భాల్లో ఆ చిత్ర పరాజయానికి, తాను నష్టపోవడానికి అసలైన బాధ్యుడు ఆ నిర్మాత మాత్రమే.
ఎందుకంటే, సినిమా అనేది గ్లామర్ ప్రపంచం... పొగడ్తల వలయం.. సినిమా నిర్మిస్తున్న న్ని రోజులూ నిర్మాతకు కొంగు భజన చేసే సగటు టెక్నీషియన్లు గానీ, నటీనటులు కానీ.. ఒక్క సినిమా ఫెయిల్యూర్ తరువాత ఆ నిర్మాత కళ్ళెదుటే కనిపించినా.. అతన్ని గుర్తుపట్టలేనంతగా మారి పోతారు. అలాంటి వారిని తన చిత్రానికి ఎన్నుకున్నందుకు.. తప్పంతా ఆ నిర్మాతది కాక..మరెవరిది.
అందుకే తన చిత్రానికి నటీనటులను, దర్శక, టెక్నీషియన్లను ఎన్నుకోవడంలో మాటల చాతుర్యం కన్నా, పని సామర్థ్యం ప్రాతిపదికగా ఎన్నుకోవాలి. ఇక అత్యంత ప్రధానంగా, "అతి వినయం ధూర్త లక్షణం".. అతి వినయం చూపించే వారిని దరిచేరకుండా చూసుకోవడమే నిర్మాత విజయానికి నిజమైన ప్రాతిపదిక.
విజయవంతమైన సినిమా నిర్మాణానికి సక్సెస్ ఫుల్ ఫార్ములా:
రూల్ నెంబర్ 1: కంటెంటే.. కింగ్..!:
అవును అది అక్షర సత్యం. సినిమా పరిశ్రమలో చిన్న వారు మొదలుకొని సెలెబ్రిటీల దాకా దాదాపు అందరూ చెప్పే మాట అది. అక్షరాలా సినిమా కథ, కథనం, మాటలు... అవసరమైతేనే పాటలు.
చిత్ర ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా అతి ముఖ్యమైన కథ, స్క్రీన్-ప్లే వ్రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. స్టోరీ సిట్టింగ్ కోసం గోవా వెళ్ళామనీ, కొడై కెనాల్ చూసొచ్చామనీ.. ఇంకేదో.. మరేదో అవసరం లేని హంగూ ఆర్భాటాలూ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. స్టోరీ అయిడియా ఇక్కడే వచ్చి, ఆ స్టోరీని చెప్పి ఒప్పించుకునే హీరో.. లేదా నిర్మాత ఇక్కడే దొరుకుతాడు కాని, అప్పటికే ఓకే అయిన .. ఆ స్టోరీ డెవలప్మెంట్ కోసం మాత్రం ఊటీనో.. మరేదో..?,br>
నిజానికి కంటెంటే కింగ్. సినిమాకు ఎన్నుకున్న కథ, కథనాలలో ఉండాల్సిన కొత్తదనం, కథ వినగానే సినిమా చూసిన భవిష్య దర్శనం కలిగించేదే... అదే అసలైన కథ..
అంతర్జాతీయంగా అనుసరిస్తున్న స్క్రీన్ ప్లే రైటింగ్ మెథడ్స్.. త్రీ యాక్ట్ స్ట్రక్చర్, రియల్ టైం స్ట్రక్చర్, మల్టిపుల్ టైం లైన్, హైపర్ లింక్, ఫ్యాబ్యులా, రివర్స్ క్రోనోలాజికల్, రషోమాన్, సర్క్యులర్, నాన్-లీనియర్, ఒనెరిక్ స్ట్రక్చర్.. లలో వ్రాసినా.. మరో కొత్త స్క్రీన్ ప్లే విధానాన్ని సృష్టించుకున్నా.. మరు నిమిషంలో ఏం జరుగుతుందో.. చెప్పలేనిదే.. మంచి స్క్రీన్ ప్లే. దానికి తర్కం జోడిస్తే వచ్చేదే విజయవంతమైన చిత్రానికి సక్సెస్ ఫుల్ స్క్రీన్ ప్లే. ఇక అతి ముఖ్యంగా.. కథ.. కథనాలలో సాగదీత లేకుండా జాగ్రత్త పడాలి.
రూల్ నెంబర్ 2: ఆర్టిస్ట్ & టెక్నీషియన్స్ సెలెక్షన్స్:
సినిమాకు కథ, కథనాలను సమకూర్చుకున్న తర్వాత, నటీనటులు మరియు టెక్నీషియన్లను ఎన్నుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. ముఖ్యంగా మీరు ఎన్నుకున్న కథ ఎలాంటిది, దాని దర్శకుడు ఎవరు? ఎటువంటి హీరోకి ఆ కథ సరిపోతుంది. ప్రత్యామ్న్యాయం ఏమిటి? ఆ తర్వాత హీరోయిన్, ఇతర ముఖ్య తారాగణం, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్.. ఇలా ప్రతి ఒక్కరినీ ఆచి తూచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడో విషయం తెలుసుకోవాలి. ఒక పని చేయడం రావడం వేరు.. ఆ పనిని తగిన రీతిలో ప్రెజెంట్ చేయడం వేరు. సినిమా కథకు తగిన నటీనటులు, టెక్నీషియన్లను ఎన్నుకోవడంలో ప్రత్యేక దృష్టి సారించాలి. అప్పుడే ఆయా నటీనటులు, టెక్నీషియన్లు ఆ సినిమాకు తగిన న్యాయం చేయగలుగుతారు.
రూల్ నెంబర్ 3: అతి ముఖ్యమైన ప్రక్రియ ఫిలిం బడ్జెటింగ్:
మార్కెట్ స్టడీ చేయకుండా మీ సినిమాకు బడ్జెట్ కేటాయిస్తే, ఆ బడ్జెత్ బూడిదలో పోసిన పన్నీరే! అవును, అక్షరాలా ఇది నిజం.. యధార్థం.
ఒక సినిమా ఎంత బడ్జెట్లో నిర్మించాలి? ఎంతలో నిర్మిస్తే సినిమా ఎంత విజయం సాధిస్తుంది? విజయానికీ.. బడ్జెట్ కూ మధ్యన ఉన్న సంబంధం ఏమిటి?
ఇవన్నీ చిక్కు ప్రశ్నలే. మా సినిమాకు అన్ని కోట్ల రూపాయలు పెట్టి విదేశాలలో షూట్ చేసాం, కోట్ల విలువైన సెట్ వేసి అంతరిక్షాన్ని భూమిమీద ప్రత్యక్షం చేయించాం.. మా సినిమా బ్యాక్ డ్రాప్ తోనే ఆడియన్స్ అదిరిపోతారు.. ఫైట్స్ తో భూమి బద్దలవుతుంది...! నిజానికి బద్దలయ్యేది భూమి కాదు.. కరిగిపొయ్యేది నిర్మాత బ్యాంక్ బ్యాలెన్స్!
మా సినిమా సాంగ్స్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళాం? సప్త సముద్రాల అవతల చిత్రీకరించాం.. లాంటి మాటలు తరచూ మనం వింటుంటూనే ఉంటాం. చిత్రం కథకు అవసరమైతే సప్త సముద్రాలు కాదు.. గ్రహ మండలాలు దాటి కూడా చిత్రీకరించవచ్చు. కాని అంత డబ్బు వెచ్చించి నిర్మించిన సినిమా మార్కెట్ విలువ ఏంటని ఒక్కసారి ప్రశ్నించుకోండి. సినిమా ఎవరితో నిర్మిస్తున్నాం? ఆ హీరో మార్కెట్ విలువ ఏంటి? ఆ దర్శకుని మార్కెట్ విలువ ఎంత? వెరసి ఎన్నుకున్న కథకు ఎంతవరకు బడ్జెట్ అవసరం అవుతుంది? ఒకవేళ ఆ బడ్జెట్ కు హీరో మార్కెట్ సరిపోకపోతే ప్రత్యామ్నాయంగా వేరే హీరో కోసం ప్రయత్నించాలా? లేక అదే హీరోతో ఓ ప్రయోగం చెయ్యవచ్చా..? ప్రయోగం చేస్తే అది విజయవంతం చేయడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వంద జాగ్రత్తలు తీసుకుని చిత్ర నిర్మాణానికి ప్రణాళిక రూపొందించుకోవాలి.
రూల్ నెంబర్ 4: మార్కెట్ స్టడీ: మీ బడ్జెట్ తిరిగి వస్తుందా? లేదా? తెలుసుకునే అవకాశం..!!:
మార్కెట్ స్టడీ నిర్మాత జయాపజయాలను ముందుగానే పసిగట్టే అవకాశం. నష్టపోకుండా సినిమా నిర్మించాలనుకునే వారికి సక్సెస్ ఫుల్ ఫార్ములా. ప్రొడక్షన్ వ్యాల్యూ, టార్గెట్ ఆడియన్స్, మార్కెటింగ్ & ఫిలిం ప్రొమోషనల్ స్ట్రాటెజీ, మార్కెట్ లో సదరు సినిమాకు ఉండబోయే మినిమం మార్కెట్ విలువ, థియాట్రికల్ డిస్ట్రిబ్యూషన్, డబ్బింగ్, ఇంటర్నేషనల్ సేల్స్, ఓటీటీ, శాటిలైట్, డిజిటల్, ఏటీటీ, మ్యూజికల్ ఇలా పలు విషయాలను పరిగణలోకి తీసుకుని మార్కెట్ స్టడీ చెయ్యవలసి ఉంటుంది.
మార్కెట్ స్టడీ అంటే మీరు, మీతో బాటే ఎప్పుడూ తిరిగే.. ఆ నలుగురు.. మీ సినిమా కాస్ట్ అండ్ క్రూ కాదు. మీరు, మీ టీం చెప్పేది చాలా విలువైన సమాచారమే. మార్కెట్ స్టడీ మీరే చేస్తే, మీ మెప్పుకోసం మీవారు మీకు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అవతలి వారి అవసరం కోసం మిమ్మల్ని ప్రక్కదారి పట్టించడం కోసం ప్రయతించేవాళ్ళూ లేకపోలేదు. అందుకే మార్కెట్ స్టడీ ఫిలిం మార్కెటింగ్ ఎక్స్ పర్ట్స్ తోగానీ, ఫిలిం మార్కెటింగ్ ఏజెన్సీతో గానీ చేయించి, వారి రిపోర్ట్ తోబాటు.. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా తెలుసుకుని మార్కెట్ విలువపై ఒక అంచనాకు రావాలి.
రూల్ నెంబర్ 5: సినిమా నిర్మాణానికి ఫండింగ్ సోర్స్ - ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్:
సినిమా నిర్మాణానికి కొంగు బంగారం ఇన్-ఫిలిం బ్రాండింగ్.
సినిమాకు బడ్జెట్ కేటాయించడం కాదు. కేటాయించిన బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో, ఆ సినిమా ముందస్తు ప్రణాళిక లో ఎటువంటి మార్పు రాకుండా పూర్తి స్థాయి క్వాలిటీ చిత్రాన్ని నిర్మించడంలోనే నిర్మాత ప్రణాళికా సామర్థ్యం తెలుస్తుంది. తక్కువ ఖర్చుతో నిర్మించడమంటే నటీనటులు, టెక్నీషియన్లకు తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం కాదు. వారి వారి పని సామర్థ్యానికి తగిన రెమ్యునరేషన్ చెల్లిస్తూనే, సినిమా నిర్మాణ, సినిమా ప్రొమోషన్ సమయాల్లో ఫిలిం బ్రాండింగ్ విధానాలలో ఫండ్ రైజింగ్ చేసుకోవడం.
సాధారణంగా సినిమాల నిర్మాణ సమయంలో కార్పోరేట్ కంపెనీలు తమ బ్రాండ్ లేదా ఉత్పత్తులను సినిమాల ద్వారా చూయిస్తూ ప్రేక్షకులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇన్-ఫిలిం బ్రాండింగ్, బ్రాండ్ ఇంటిగ్రేషన్ ఇన్ ఫిలిం, ప్రొడక్ట్ ప్లేస్మెంట్ ఇన్ ఫిలిం లుగా పిలిచే ఈ ఇన్-ఫిలిం బ్రాండింగ్ వల్ల సదరు చిత్ర నిర్మాణానికి డబ్బు రూపంలో, ఇతర సపోర్ట్ రూపంలో నిర్మాత తన చిత్ర ఖర్చును తగ్గించుకుని లాభపడవచ్చు. ఈ ఇన్-ఫిలిం బ్రాండింగ్ చిన్న సినిమా తోబాటు, భారీ బడ్జెట్ సినిమాలకూ లభిస్తుంది. సినిమా, నిర్మాణ సంస్థ, నటీనటుల స్థాయిని బట్టి ఇన్-ఫిలిం బ్రాండింగ్ కోసం కార్పోరేట్ కంపెనీలు నిధులను కేటాయిస్తూ ఉంటాయి.
ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, చిత్ర కథ, కథనాల సమయంలోనే కథలో అంతర్లీనంగా పొందుపరిచే బ్రాండ్స్ మరియు ప్రొడక్ట్ లకు స్థానం కల్పించాలి. ఈ విషయంలో ఇన్-ఫిలిం బ్రాండింగ్ ఏజెన్సీలు దర్శక, నిర్మాతలకు బాగా సహకరిస్తారు. ఇన్-ఫిలిం బ్రాండింగ్ ఏజెన్సీల సలహాతో మరిన్ని ఎక్కువ బ్రాండ్లను కూడా చిత్ర కథ, కథనాల్లో పొందుపరచుకుని చిత్ర నిర్మాణానికి మంచి బడ్జెట్ సమకూర్చుకోవచ్చు. తద్వారా చిత్ర నిర్మాణ వ్యయం తగ్గడం, కార్పోరేట్ బ్రాండ్స్ వారి సహకారం తో మంచి పబ్లిసిటీని చిత్రానికి ఇవ్వడం వల్ల ఆయా చిత్రాలు మంచి విజయం సాధించడానికి రాజమార్గం ఏర్పడుతుంది. తద్వారా ఆ సినిమా థియాట్రికల్, శాటిలైట్, ఓటీటీ, డబ్బింగ్ మరియు మ్యూజికల్ రైట్స్ కు ఎక్కువ మార్కెట్ విలువ పొందే అవకాశం ఉంటుంది.
రూల్ నెంబర్ 6: సినిమా నిర్మాణానికి ఫండింగ్ సోర్స్ - ఫిలిం సబ్సిడీ:
తమ సినిమా నష్టాల బారిన పడకుండా నిర్మించాలనుకునే వారికి కొంగు బంగారం ఫిలిం సబ్సిడీ. దేశంలోని కేంద్ర ప్రభుత్వం తోబాటు, 18 రాష్ట్ర ప్రభుత్వాలు చిత్ర నిర్మాతలను ఫిలిం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వాలు సినిమాలకు ఇస్తున్న ఈ సబ్సిడీ కనీసం రూ. 10,00,000/- (పది లక్షల రూపాయలు) మొదలుకొని రూ. 4,00,00,000/- (నాలుగు కోట్ల రూపాయలు) దాకా ఉంది. ముఖ్యంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్కృతి, కళలు, పర్యాటక ప్రాంతాలకు విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం, తమ పబ్లిసిటీ లో భాగంగా.. సినిమాలకు కొంత చోటును కల్పించాయి. ఆయా ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం సినిమాలలో టూరిజం ప్రోత్సహించడం కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు కేటాయిస్తూ వస్తున్నాయి. ఆయా సబ్సిడీలను స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సినిమాలకు ఇవ్వడం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, ఆ కమిటీ సలహాతో పలు సినిమాలకు సబ్సిడీని అందిస్తూ వస్తున్నాయి. ఇలా సినిమాల నిర్మాణానికి ఇస్తున్న సబ్సిడీ కోసం ముందుగానే ప్రయత్నించి, తగిన అనుమతి పత్రాలు తీసుకుని సినిమాలు నిర్మించడం వల్ల ఆయా చిత్ర నిర్మాతలకు మరింత వెలుసుబాటు కలుగుతుంది. తద్వారా సదరు సినిమా యావరేజ్ గా మిగిలినా, సినిమా నిర్మాత పెద్దగా నష్టపోయే పరిస్థితి తలెత్తదు.
రూల్ నెంబర్ 7: ఫిలిం ప్రొమోషన్ స్ట్రాటెజీ:
మీ సినిమాకు సరైన ప్రొమోషన్ చెయ్యలేదంటే.. మీ సినిమా ఉన్నా.. లేనట్లే లెక్క. ఇది అక్షరాలా నిజం. సినిమా చిన్న బడ్జెట్ సినిమానా, లేక భారీ బడ్జెట్ సినిమానా.. కొత్త హీరోనా.. లేక స్టార్ హీరోనా...!. ఏదైనా ఫరవాలేదు కాని ఆ సినిమాకు తగిన పబ్లిసిటీ చెయ్యడం మాత్రం తప్పనిసరి.
దర్శకనిర్మాతలు తమ సినిమా పబ్లిసిటీ కోసం టీజర్లు, ట్రైలర్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు చేసి కొన్ని డిజిటల్ మార్కెటింగ్ నెట్ వర్క్స్ లల్లో తమ ప్రొమోషన్ చేసి వేలల్లోనో.. లక్షల్లోనో వ్యూస్ వచ్చాయని, తమ సినిమా బ్రం హాండం గా పబ్లిసిటీ చేసామని చెబుతారు.
కాని ఒక్క ప్రశ్న?
ఆడిజిటల్ మాధ్యమాల్లో వచ్చిన వ్యూస్ లో నిజమెంత.. ఫేక్ ఎన్ని? నిజంగా వచ్చిన వ్యూస్ అనుకోకుండా చూసినవా.. కావాలని చూసినవా? ఆ వ్యూస్ లో ఎంతమంది సినిమా థియేటర్ కు వచ్చే అవకాశం ఉంది? మరెంతమంది ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అనుకునేవారున్నారు? మరీ ముఖ్యంగా చూసినవెంటనే ఆ పొస్ట్ గూరి, ఆ సినిమా గూర్చి మర్చిపోయేవారెందరు?
కనుక సినిమాకు నిజమైన ప్రొమోషన్ జరగాలంటే.. సినిమా వాళ్ళే ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి. లేదా.. ఎక్కడున్న ప్రేక్షకుడ్నైనా ఆకట్టుకునేలా ప్రొమోషనల్ నెట్వర్క్ విస్తృతం చెయ్యాలి.
మీ సినిమా ప్రొమోషన్ కోసం యూత్ కనెక్ట్, కాలేజ్ విజిట్, సోషల్ నెట్వర్కింగ్, కమ్యూనిటీ నెట్వర్కింగ్, ప్రొమోషనల్ టూర్, ఇంటలెక్చువల్ కనెక్టింగ్, క్రాస్ బ్రాండింగ్, గ్రూప్ బ్రాండింగ్, మోటివేషనల్ బ్రాండింగ్, రీ-కనెక్ట్ బ్రాండింగ్, రీకాల్ బ్రాండింగ్...
ఈ ప్రొమోషన్ అన్నీ సినిమా విజవతమవ్వడానికి ఎంత అవసరమంటే... బంగారం అమ్ముతున్న షోరూం వాళ్ళు తమ బంగారం గూర్చి పదేపదే అన్ని మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేసేంతగా అవసం.
ఈ ఏడు సూత్రాలను పాఠించి సినిమా నిర్మించడం వల్ల సినిమాలో కథ, కథనం, నిర్మాణం లో మరింత నాణ్యత పెరగడంతోబాటు, ఆర్థికంగా తోడ్పాటు లభించి నిర్మాత లాభపడటానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితోబాటు మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, షెడ్యూల్ మేనేజ్మెంట్, ఆర్టిస్ట్ & టెక్నీషియన్ మేనేజ్మెంట్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ మరియు లొకేషన్ మేనేజ్మెంట్ విషయాలలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సదరు సినిమా ఘనవిజయం సాధించకున్నా, నిర్మాత నష్టపోవడం మాత్రం ఖచ్చితంగా జరగదు.
ఎందుకంటే.. నిర్మాత శ్రేయస్సే సినిమా శ్రేయస్సు
నిర్మాత సుఖంగా ఉంటేనే సినీ పరిశ్రమ ఎల్లకాలం వర్ధిల్లుతుంది
నిర్మాత సుఖినోభవంతు
పరిశోధక రచన: వెంకటేశ్వర్లు బులెమోని
(రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గ్రహీత )
సీఈవో, సినెటేరియా మీడియా వర్క్స్
వ్యాస రచయిత: బులెమోని వెంకటేశ్వర్లు సీనియర్ జర్నలిస్టు, రచయిత, దర్శకుడు మరియు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు విజేత. గత మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ, "తెలుగు సినిమా చరిత్ర", "తెలుగు సినిమా వైతాళికులు", "తెలుగు సినిమా ఆణిముత్యాలు" పరిశోధనాత్మక గ్రంధాల రచయితగా సుపరిచితం.
ఏందుకీ వ్యాసం: ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో చిత్రాలు నిర్మిస్తుంటే, వాటిలో కేవలం 25% - 40% మాత్రమే ఆర్థిక నష్టాల నుంచి బయటపడుతూండటం గమనార్హం. ఆర్థిక నష్టాలు రాకుండా సినిమాల నిర్మాణం జరిగితే పరిశ్రమకు మంచిదని, సక్సెస్ అవుతున్న సినిమాలను మరియు ఫెయిల్యూర్ అవుతున్న సినిమాలను, వాటి జయాపజయాలకు కారణాలను గత రెండు సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి ఈ పరిశోధనాత్మక వ్యాసం వ్రాయడం జరిగింది.
(గమనిక: ఫిలిం మార్కెట్ స్టడీ, ఇన్-ఫిలిం బ్రాండింగ్ మరియు ఫిలిం సబ్సిడీల కోసం సినెటేరియాను సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్: 0 83416 89555)